సుజనా, సీఎం రమేశ్​ నిజాయతీపరులట!

513
0
  • సుజనా, సీఎం రమేశ్​ నిజాయతీపరులట!
  • వారిపై ఉన్నవి ఆరోపణలు మాత్రమేనట
  • కేసులు, చార్జిషీట్లు లేవట
  • హోంశాఖ సహాయమంత్రి కిషన్​ సంచలన ప్రకటన

బీజేపీలో చేరాలేగానీ విజయ్​ మాల్యా, నీరవ్​ మోడీ, మెహుల్​ చోక్సీలు కూడా నిజాయతీపరులు అయ్యేవారు. గంగలో మునిగితే సర్వపాపాలు పోయినట్టు.. ఎంత పెద్ద మోసగాడు అయినా సరే బీజేపీలో చేరితే సత్పురుషులు అవడం ఖాయం. అంతటి స్వచ్ఛమైన పార్టీ బీజేపీ. నిన్నమొన్నటిదాకా సుజనా చౌదరి, రమేశ్​ దొంగలూ లంగలూ అని బీజేపీ నాయకులు తిట్టారు కదా. ఇప్పుడు తూచ్​ అంటున్నారు.టిడిపి నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్‌ తదితరులపై ఆర్థికపరంగా కేసులేమి లేవని, వారిపై కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు. ఇంకో అద్భుత విషయం కూడా చెప్పారు మంత్రివర్యులు. చట్టబద్దంగానే ఆ నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో విలీనం అయ్యారట. అనవసరంగా మీడియా, సోషల్​ మీడియా ఆడిపోసుకుంటున్నాయట. బీజేపీ దృష్టిలో ప్రజలంతా ఎర్రోళ్లు, అమాయకులు. ఏం చెప్పినా నమ్ముతున్నారన్నది కిషన్​ రెడ్డి వంటి నాయకుల ధీమా.  సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ముందస్తు ప్రణాళికలో భాగంగానే బీజేపీలో చేరారు. ఈడీ, ఆదాయపన్ను కేసులతోపాటు రాజధానిలో కొనుగోలు చేసిన రూ.వందల కోట్ల విలువైన భూములను కాపాడుకోవడానికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పంచన చేరారు. బ్యాంకుల నుంచి రూ.6,000 కోట్ల మేర రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), సీబీఐ పూర్తి ఆధారాలను సేకరించడంతో అరెస్ట్‌ల భయంతోనే ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి సుజనా చౌదరి ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపారు.

దొంగ కంపెనీల పేరు మీద తీసుకున్న రూ.364 కోట్ల రుణాలు ఎటువంటి వ్యాపార లావాదేవీలు జరపకుండానే హైదరాబాద్‌లోని వైస్రాయ్‌ హోటల్‌కు చేరినట్లు ఈడీ దర్యాప్తులో తేలడంతో  వైస్రాయ్‌ హోటల్‌కు చెందిన రూ.315 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసింది. ఇప్పుడు ఈ మొత్తం వైస్రాయ్‌ హోటల్‌ నుంచి చివరకు ఎక్కడకు చేరిందన్న అంశం వెల్లడి కావాల్సి ఉంది. ఈ కేసులో ఇక అరెస్ట్‌ తప్పకపోవడంతో పాటు కుంభకోణం వెనుక ఉన్న పెద్ద వ్యక్తులు బయటకు వస్తారన్న భయంతోనే బీజేపీ పెద్దలు అమిత్‌ షా, రాంమాధవ్‌లతో సంప్రదింపులు జరిపారు. దీనికి ప్రధాని మోదీ ఆమోదముద్ర వేయడంతో సుజనా చౌదరి బీజేపీలో చేరాడు. సీఎం రమేష్‌ కూడా రిత్విక్‌ ఇన్‌ఫ్రా పేరిట దొంగ ఇన్వాయిస్‌లు సృష్టించి రూ.800 కోట్ల నిధులను డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు ఐటీ శాఖ అధికారులకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ కేసులో సీఎం రమేష్‌ ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు అరెస్ట్‌ చేయడమే మిగిలింది.  రాజధాని ప్రాంతం వివరాలను చంద్రబాబు ముందుగానే తన అనుయాయులకు లీక్‌ చేసి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయించాడు. రాజధాని ప్రకటన వెలువడక ముందే సుజనా చౌదరి 700 ఎకరాలు, సీఎం రమేష్‌ 500 ఎకరాల వరకు బినామీల పేరుతో కొనుగోలు చేశారు. టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావులు కూడా రాజధానికి చుట్టుపక్కల పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. వీరి వ్యాపారాలు కూడా ప్రస్తుతం సమస్యల్లో ఉన్నాయి. ఇప్పుడు రాజధాని భూములపై విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయన్న భయం వీరిని వెంటాడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here