ప్ర‌భుత్వం ఎందుకు స్పందించాలి ?

443
  • ప్ర‌భుత్వం ఎందుకు స్పందించాలి ?
  • మీరు చేసిన త‌ప్పుల‌కు ఎందుకు బాధ్య‌త వ‌హించాలి
  • ఆర్టీసీ యూనియ‌న్ల స‌మ్మె, డిమాండ్లు నూరుశాతం త‌ప్పు
  • చేతులు కాలాకా ఆకులు ప‌ట్టుకుంటే ఏం లాభం

ఆర్టీసీ జాక్ క‌న్వీన‌ర్ అశ్వ‌త్థామ రెడ్డి దృష్టిలో ప్ర‌భుత్వం అంటే ఎలా ఉండాలంటే… ఆయ‌న వంగ‌మ‌న్న‌ప్పుడు వంగాలి. లేవ‌మ‌న్న‌ప్పుడు లేవాలి. ఈయ‌న స‌మ్మె ప్ర‌క‌ట‌న చేయ‌గానే కేసీఆర్ వ‌చ్చి బాబ్బాబు.. నీ బాధ‌లేంటో చెప్పు తీర్చేస్తా.. అర్జెంటుగా విలీనం చేస్తా అనాలి. ఇలాంటి నాయ‌కుల వ‌ల్లే ఆర్టీసీ గంగ‌ల క‌లిసింది. 48 రోజులుగా ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపిస్తున్న రెడ్డి లాంటి వాళ్ల డిమాండ్ల‌కు ప్ర‌భుత్వం లొంగ‌కూడ‌దు.

వీళ్ల డిమాండ్లు, స‌మ్మె త‌ప్పు కాబ‌ట్టే హైకోర్టు కూడా సైలెంట్ అయిపోయింది. ఇవ‌న్నీ తెలుసు కాబ‌ట్టి.. వెంట‌నే మ‌మ్మ‌ల్ని బేష‌ర‌తుగా డ్యూటీల్లో చేర్చుకోవాల‌ని రెడ్డి బ్లాక్‌మేల్ చేస్తున్న‌డు. ఉద్యోగాల్లోకి తీసుకోనందుకు ఈరోజు బ‌స్ డిపోల ఎదుట ఆందోళ‌న చేస్తాన‌ని కూడా ప్ర‌క‌టించాడు. కేసీఆర్ మీకు మూడుసార్లు చాన్సిచ్చాడు. ఉద్యోగాల్లో చేరండి బాగా చూసుకుంటా అని భ‌రోసా కూడా ఇచ్చాడు.

పిలిచి పిల్ల‌నిస్త‌నంటే వ‌ద్ద‌న్న‌ట్టు.. అప్పుడు కేసీఆర్ మాట‌ల‌ను ఖాత‌రు చేయ‌లేదు. ఇప్పుడు త‌త్వం బోధ‌ప‌డి డ్యూటీల్లో చేరతానంటే ప్ర‌భుత్వం ఎందుకు ప‌ట్టించుకోవాలి. మీ పిచ్చి వేషాల వ‌ల్ల ఆర్టీసీకి ఎన‌లేని న‌ష్టం జ‌రిగింది. పండ‌గ ఆదాయం పోయింది. న‌ష్టాలు ప‌రాకాష్ట‌కు చేరాయి. ఇప్పుడు మిమ్మ‌ల్ని బేష‌రతుగా ఉద్యోగాల్లోకి తీసుకుంటే మ‌ళ్లీ మీరు ప్ర‌భుత్వాన్ని బ్లాక్‌మేల్ చేయ‌ర‌న్న న‌మ్మ‌కం ఏంటి ? ఆర్టీసీ యూనియ‌న్లు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో, బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి. ఇందుకోసం కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవ‌డం త‌ప్ప‌దు.

యూనియన్లు భవిష్యత్‌లో బుద్ధిగా ఉండాలంటే విలీనం మాట ఎన్నడూ ఎత్తబోమని తప్పనిసరిగా హామీ తీసుకోవాలి. ఇక నుంచి కార్మికులు సమ్మె బాట పట్టకుండా, ఓ నిర్దిష్ట కాలం పాటు సమ్మె చేయబోమంటూ స్వయంగా ఒప్పుకునేలా షరతు విధించడం అనివార్యం. సమ్మె కాలానికి జీతం అడగవద్దన్న షరతును కార్మికులంతా ఒప్పుకోవాలి. ఎందుకంటే, నష్టాల్లో ఉన్న ఆర్టీసీ.. కార్మికుల సమ్మెతో మరింత నష్టాల ఊబిలోకి వెళ్లింది. సమ్మె కాలానికి సంస్థ జీతం చెల్లించే పరిస్థితి లేదు. సంస్థ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని కార్మికులు కొన్ని త్యాగాలకు సిద్దపడక తప్పదు.